Tuesday, November 26, 2019

how-to-do-Pre-Registration-and-Document-Creation-registration.ap.gov.in-www.igrs.ap.gov.in

how-to-do-Pre-Registration-and-Document-Creation-registration.ap.gov.in-www.igrs.ap.gov.in

మీ దస్తావేజుకు మీరే లేఖరి మధ్యవర్తులను ఆశ్రయించక్కర్లేదు రిజిస్ట్రేషన్ల శాఖలో నూతన విధానం

ఇళ్లు, స్థలాలు విక్రయించాలన్నా, కొనాలన్నా, బహుమతిగా కుటుంబసభ్యులకు ఇవ్వాలన్నా  రిజిస్ట్రేషన్‌ చేయించడం తప్పనిసరి. ఈ సమయంలో దస్తావేజులు ఎలా రాయాలో ఎవరికీ తెలియదు కాబట్టి..  లేఖరులను ఆశ్రయిస్తుంటారు, మధ్యవర్తుల సహకారం తీసుకుంటారు. దీనికోసం వారికి ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ అవసరం లేదు. మన దస్తావేజులను మనమే తయారు చేసుకునేలా రిజిస్ట్రేషన్స్‌, స్టాంప్స్‌ శాఖ ‘పబ్లిక్‌ డేటా ఎంట్రీ’ మాడ్యూల్‌ను రూపొందించింది. నూతన సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించేందుకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. కృష్ణా జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు.




ప్రజలు తమ స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా, తమ దస్తావేజులు తామే తయారు చేసుకునేందుకు వీలుగా పబ్లిక్‌ డేటా ఎంట్రీ మాడ్యూల్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి దగ్గరే కూర్చొని ఆన్‌లైన్‌లో మన వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది. తెలుగు, ఆంగ్లమాధ్యమాల్లో రెండు ఆప్షన్లు పెట్టారు. ఏ భాషలో కావాలంటే అందులో దస్తావేజు రూపొందించుకోవచ్చు.  మనమే తయారు చేసుకుంటాము కాబట్టి, తప్పులు లేకుండా, ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కు అయ్యే వ్యయం కూడా ఆటోమేటిక్‌గా జనరేట్‌ అయిపోతుంది. దీనిని ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చు. టైమ్‌ స్లాట్‌ బుక్‌ చేసుకొని, ఆ సమయానికి సాక్షి సంతకం చేసేవాళ్లు, విక్రయదారు, కొనుగోలు దారులు వెళితే సరిపోతుంది. మిగిలిన ప్రక్రియ అంతా మామూలే.

ఎలా తయారు చేసుకోవాలంటే..



  1. రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ వెబ్‌సైట్‌   http://registration.ap.gov.in  లోకి వెళ్లాలి. 
  2. అందులో పబ్లిక్‌ డేటా ఎంట్రీ ఆప్షన్‌ ఉంటుంది. దాని మీద క్లిక్‌ చేస్తే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ అడుగుతుంది. 
  3. అక్కడే కింద న్యూ యూజర్‌ అన్న చోట క్లిక్‌ చేస్తే ఒక పేజీ వస్తుంది. 
  4. అందులో మన పేరు, ఫోన్‌ నెంబరు, ఆధార్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, చిరునామా, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ టైప్‌ చేయాలి.
  5.  సబ్‌మిట్‌ కొడితే మన ఫోన్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీకి ఓటీపీ వస్తుంది.
  6.  దానిని పేజీలో  సబ్‌మిట్‌ చేస్తే మన పేరు రిజిస్టర్‌ అవుతుంది. 
  7. హోమ్‌పేజీకి వెళ్లి పబ్లిక్‌ డేటా ఎంట్రీపై క్లిక్‌ చేసి అందులో మనం క్రియేట్‌ చేసుకున్న యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేయగానే పేజీ ఓపెన్‌ అవుతుంది. 
  8. అందులో కొన్ని ఆప్షన్స్‌ చూపిస్తుంది. 
  9. న్యూ డాక్యుమెంట్‌ పై క్లిక్‌ చేస్తే ఆస్తికి సంబంధించి వివరాలు నమోదు చేసే పేజీ వస్తుంది.
  10.  అందులో విక్రయదారుడు, కొనుగోలుదారుడు పేర్లు, చిరునామా, ఆధార్‌ నెంబర్లు, ఆస్తి వివరాలు, సర్వే నెంబర్లు, హద్దులు, లింక్‌ డాక్యుమెంట్లు, వివరాలు, సాక్షుల వివరాలు అడిగిన చోట మనం టైప్‌ చేయాలి. 
  11. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను అందులో అప్‌లోడ్‌ చేయాలి. మనం ఆస్తి వివరాలు కొట్టగానే ఆటోమెటిక్‌గా ఎంత స్టాంప్‌ డ్యూటీ చెల్లించాలనేది అందులో చూపిస్తుంది. 
  12. ఆన్‌లైన్‌లో దానిని చెల్లించాలి.  
  13. దస్తావేజు ఫార్మెట్‌లో మనం  వివరాలు అన్నీ పొందుపరిస్తే, అది జనరేట్‌ అవుతుంది.
  14.  వాటిని స్టాంప్‌ పేపర్లపై ప్రింట్‌ చేయించుకొని, టైమ్‌ స్లాట్‌ బుక్‌ చేసుకొని ఆ సమయానికి వెళితే సరిపోతుందని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.
  15.  దీని కోసం సిటిజన్‌ హెల్ప్‌ డెస్క్‌ను కూడా పెట్టారు. 
  16. ఏమైనా సందేహాలు ఉంటే  హెల్ప్‌ డెస్క్‌ నెంబరు 91211 06359ను సంప్రదించాలని సూచించారు.*



ఇవీ ఉపయోగాలు..


*సులభతరమైన, కచ్చితమైన ఆన్‌లైన్‌ చెల్లింపులు*
*పారదర్శకమైన, సాంకేతికమైన మార్కెట్‌ విలువల లెక్కింపు*
*నమోదైన సమాచారాన్ని ఈసీలో పొందుపర్చడం ద్వారా ఆఫీసులో డేటా ఎంట్రీలో జరిగే పొరపాట్లను నివారించచ్చు.*
*మరింత వేగంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుంది.*


ఇంటి దగ్గరే  తయారు చేసుకోవచ్చు

కృష్ణా జిల్లాలో మొత్తం 28 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. అన్ని చోట్లా నూతన ప్రక్రియ అమల్లోకి తీసుకొచ్చారు. ఈ విధానం కొత్త కావడం, ప్రజలకు పూర్తిగా తెలియకపోవడం వల్ల ఇంకా ఎవరూ ముందుకు రావడం లేదు. కరపత్రాలు పంచి, బ్యానర్లు పెట్టి అవగాహన కల్పిస్తున్నాం. ప్రజల్లో కూడా కొంత అపోహ ఉంది. దస్తావేజు లేఖరులు మొత్తం వివరాలతో రాస్తేనే, డాక్యుమెంట్‌ అనుకుంటున్నారు. కొత్త విధానంలో వివరాలు పొందుపరిస్తే, ఆటోమెటిక్‌గా దస్తావేజు జనరేట్‌ అవుతుంది. క్రయ, విక్రయదారుల మధ్య అంగీకారమైన షరతులను, నిబంధనలను పొందుపర్చాలి. కంప్యూటర్‌ ద్వారా తయారైన దస్తావేజును పొందాలి. రిజిస్ట్రేషన్‌ కోసం ఎంపిక చేసుకునే సమయాన్ని ముందుగా నిర్దేశించుకోవాలి.
                                                                                         
Click Here for 

Official Website
రిజిస్ట్రేషన్ దస్తావేజు తయారీ ప్రక్రియ / Pre Registration and Document Creation Module