Tuesday, March 8, 2022

Best Fuel Credit Cards - Check Offers and Apply

Fuel Credit Cards: ఈ కార్డులతో ఇంధన ఖర్చులు ఆదా.. ఎంత తగ్గించుకోవచ్చు?

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగనున్నాయన్న వార్తలు సామాన్యులను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి

 ఈ నేపథ్యంలో దేశీయంగానూ ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వ‌చ్చే వారంలో పెట్రోల్ ధ‌ర‌ లీట‌రు రూ.120 వ‌ర‌కు చేరే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇలాంటి స్థితిలో సాధ్యమైనంత వరకు ఇంధన ఖర్చు ఆదా చేసేందుకు ప్రయత్నించాలి. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై వినియోగదారులకు కొంతవరకు ప్రయోజనం చేకూర్చే ఇంధన ఆధారిత క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి

Best Fuel Credit Cards - Check Offers and Apply

ముఖ్యంగా ఇంధ‌న వాడ‌కం ఎక్కువ‌గా ఉన్న‌వారు తమకు త‌గిన కార్డు తీసుకోవ‌డం ద్వారా కొంత వ‌ర‌కు ఈ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవచ్చు

ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు ఫ్యూయల్ బేస్డ్‌ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఇవి పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై ఖర్చును తగ్గించుకోవడంలో సహాయపడుతున్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి రిటైలర్ల భాగస్వామ్యంతో బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థలు ఈ కార్డులను జారీ చేస్తున్నాయి

ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో భాగస్వామ్య సంస్థ ఇంధన పంపుల వద్ద కొనుగోళ్లు చేస్తే కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. ప్రయాణానికి తమ సొంత వాహనాలను ఉపయోగించేవారు ఈ కార్డుల ద్వారా ఎక్కువ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. భారత్‌లోని చాలా ఇంధన ఆధారిత క్రెడిట్ కార్డులు రివార్డు పాయింట్లు అందిస్తున్నాయి. ఈ విధానంలో కార్డు ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసిన ప్రతిసారీ మీకు కొన్ని రివార్డు పాయింట్లు లభిస్తాయి. వీటితో తిరిగి ఇంధనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. కొన్ని కార్డులు ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపులను కూడా అందిస్తున్నాయి*

ఉదాహరణకు.. సిటీ ఇండియన్ క్రెడిట్ కార్డును తీసుకుంటే..

ఇండియన్ ఆయిల్ అవులట్‌లెట్‌లో ఖర్చు చేసే ప్రతి రూ. 150కి నాలుగు టర్బో పాయింట్లను అందిస్తుంది. ఒక టర్బో పాయింట్ రిడెంప్షన్ విలువ ఒక రూపాయి. అంటే ఇండియన్ ఆయిల్ అవుట్ లెట్లో ఈ కార్డును ఉపయోగించి చేసే రూ.10 వేల ఇంధన ఖర్చుపై రూ.267కి సమానమైన పాయింట్లు లభిస్తాయి. అంతేకాకుండా, ఇతర కొనుగోళ్లపై (కిరాణా సామాగ్రి, సూపర్ మార్కెట్ ఖర్చులపై) అదనపు పాయింట్లు పొందొచ్చు

ఎలా పనిచేస్తాయి?

మ‌నం ముందే చెప్పుకున్న‌ట్లు క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థ‌లు నిర్దిష్ట ఇంధన రిటైలర్లతో జట్టుకడతాయి. మీ వాహ‌నంలో ఇంధ‌నాన్ని రీఫిల్ చేసిన‌ప్పుడు కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే రివార్డు పాయింట్ల‌ను అందిస్తాయి. ఇలా ఇంధ‌న ఆధారిత క్రెడిట్ కార్డును ఉప‌యోగించి చేసే కొనుగోళ్ల‌పై ఎంత వ‌ర‌కు ఆదా చేసుకోవ‌చ్చో ఒక ఉదాహ‌ర‌ణ ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం

మీరు హైదరాబాద్‌లో నివసిస్తున్నారనుకుందాం.* *ఏడాదికి స‌గ‌టున 15,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారని అంచనా వేద్దాం. అంటే నెలకు సగటున 1,250 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. మీ కారు సగటున లీటరుకు 10 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందనుకుంటే ఏడాదికి 1500 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేయాలి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర‌ రూ.108.20. ఈ ధరను పరిగణనలోకి తీసుకుంటే 1500 లీటర్ల పెట్రోల్ కొనుగోలు కోసం రూ.1,62,300 ఖర్చు చేయాల్సి ఉంటుంది

అంటే నెలకు రూ.13,500 పైనే ఖర్చు చేస్తారు. ఈ ఖర్చును కార్డు ద్వారా చెల్లిస్తే నెలకు రూ.360 వరకు, ఏడాదికి రూ.4,320 విలువైన రివార్డు పాయింట్లను పొందొచ్చు. ఈ మొత్తంతో తిరిగి 40 లీటర్ల వరకు పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు. ఇక్కడ ప్రతి రూ.150కి నాలుగు రివార్డు పాయింట్లు మాత్రమే లెక్కించడం జరిగింది. మీరు తీసుకున్న కార్డు ఆధారంగా మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు.

ప్రయోజనాలు.

ఇంధన ఆధారిత కార్డులు ఇంధన వినియోగంపై రివార్డు పాయింట్లు అందిస్తాయి. కో-బ్రాండెడ్ కార్డులైతే.. కొన్ని ఇతర కేటగిరీల్లో చేసే ఖర్చులపైనా రివార్డు పాయింట్ల‌ను, భాగస్వామ్య వ్యాపారుల వద్ద చేసే కొనుగోళ్లపై డిస్కౌంట్లను అందిస్తాయి. దీంతో పాటు వెల్కమ్‌ బోనస్, మైలురాయి బోనస్, ఇంధన కొనుగోళ్లపై సర్‌ఛార్జి మినహాయింపు లాంటి అదనపు ప్రయోజనాలను అందిస్తాయి

ఇంధన కొనుగోళ్లపై 5 శాతం వరకు వేగవంతమైన రివార్డ్ పాయింట్లను సంపాదించొచ్చు. కాబట్టి ఫ్యూయల్ కార్డుల్లో యాక్సెలరేటెడ్ రివార్డ్ పాయింట్ల సదుపాయం ప్రధాన హైలైట్. సాధారణంగా 1 శాతం ఇంధన సర్‌ఛార్జి మినహాయింపు ఉంటుంది. దీంతో గణనీయంగా పొదుపు చేయొచ్చు. అయితే కొన్ని సంస్థలు జారీ చేసే కార్డులకు సర్‌ఛార్జీ మాఫీ మొత్తంపై గ‌రిష్ఠ పరిమితి ఉంటుంది. ఈ కార్డులను ఉపయోగించి ఇంధనం మాత్రమే కాకుండా దుస్తులు, కిరాణా వంటివీ కొనుగోలు చేసి రివార్డు పాయింట్లను పొందొచ్చు

ఎవరు తీసుకోవాలి?

క్రమం తప్పకుండా సొంత వాహనాల్లో ప్రయాణించే వారు, కార్యాలయాలకు ఎక్కువ దూరం సొంత వాహనాల్లో రోజూ వెళ్లొచ్చే వారు ఇంధన ఆధారిత క్రెడిట్ కార్డును తీసుకోవడం మంచిది

ప‌రిమితుల‌ను తెలుసుకోండి..

కార్డు జారీ చేసే సంస్థ‌లు* *యాక్సెల‌రేటెడ్ రివార్డు* *పాయింట్లు, స‌ర్‌ఛార్జ్* *మిన‌హాయంపుపై ముందుగానే గ‌రిష్ఠ ప‌రిమితిని* *నిర్ణ‌యిస్తుంటాయి. కాబ‌ట్టి* *ఇంధ‌నం ఎక్కువ‌గా కొనుగోలు చేసేవారికి.. వారి కొనుగోళ్ల‌కు త‌గిన‌ట్లుగా, విధించిన ప‌రిమితికి లోబ‌డి ప్ర‌యోజ‌నాలు* *అందుతాయ‌ని గుర్తుంచుకోవాలి

ఇంధ‌న స‌ర్‌చార్జ్ మిన‌హాయింపు, యాక్సెల‌రేటెడ్ రివార్డు పాయింట్ల సౌక‌ర్యం భాగస్వామ్య ఇంధ‌న రిటైల‌ర్ వ‌ద్ద మాత్ర‌మే* *అందుబాటులో ఉంటుంది. ఇతర రిటైల‌ర్ వ‌ద్ద ఇంధ‌నం కొనుగోలు చేస్తే ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోవ‌చ్చు

ఇంధ‌న ఆధారిత క్రెడిట్ కార్డులు ఇంధ‌న ఖ‌ర్చుల‌ కోసం రూపొందించారు. కాబ‌ట్టి, ఈ కార్డుల‌ను ఉప‌యోగించి చేసే ఖ‌ర్చుల‌పై ల‌భించిన‌న్ని ప్ర‌యోజ‌నాలు ఇత‌ర ఖ‌ర్చుల‌పై ల‌భించ‌వు

ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి.

ముందుగా ఇంధ‌న ఖ‌ర్చుల‌ను అంచ‌నా వేయండి. మీరు సొంత వాహ‌నాన్ని త‌క్కువ‌గానూ, ప్ర‌జా రవాణాను ఎక్కువ‌గానూ ఉప‌యోగించే వారైతే ఈ కార్డులు మీకు స‌రిపోకపోవ‌చ్చు మీరు ఎంచుకున్న కో-బ్రాండ్ ఆయిల్ పంపు మీకు స‌మీపంలో లేక‌పోతే.. ఇంధ‌నం రీఫిల్ చేయించ‌డానికి పెట్రోల్ పంపుకి వెళ్లిన ప్ర‌తిసారీ స‌మ‌యం, ఇంధ‌నం రెండూ వృథా అవుతాయి. అందువ‌ల్ల కార్డు తీసుకోవ‌డానికి ముందే మీ ఇల్లు లేదా కార్యాల‌యం ద‌గ్గ‌ర్లోని, లేదా మీరు రోజూ ప్ర‌యాణించే మార్గంలో ఉన్న‌ పెట్రోల్ పంపుల‌ జాబితాను త‌యారు చేయండి

 ఇందులో నుంచి మీరు త‌రుచుగా ఇంధ‌నం రీఫిల్ చేసుకునే పెట్రోల్ పంపుల‌ను గుర్తించండి. వీటికి సంబంధించిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల‌నే ఎంచుకోవాలి

రివార్డు పాయింట్ల‌కు ఎక్స్‌పెయిరీ తేదీ ఉండొచ్చు. ఎక్స్‌పెయిరీ తేదీ కంటే ముందే రివార్డు పాయింట్ల‌ను ఉప‌యోగించుకోవాలి. అందువ‌ల్ల ఎక్స్‌పెయిరీ తేదీని మార్క్ చేసుకోండి

కొన్ని ఫ్యూయల్ కార్డుల‌కు వార్షిక రుసుములు, రివార్డ్ రేట్‌, రెడెంప్షన్, కో- బ్రాండెడ్ ప్ర‌యోజ‌నాల విష‌యంలో నియ‌మ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. వాటిని ముందే తెలుసుకోవాలి

ఇంధ‌న ఖ‌ర్చుపై డ‌బ్బు ఆదా చేసేందుకే కార్డును తీసుకుంటున్నాం. అయితే ఒక్కోసారి మ‌నం ఆదా చేసే దానికంటే కార్డు వార్షిక రుసుములు, జాయినింగ్ ఫీజులే ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల ప్ర‌తి నెలా మీరు చేసే ఇంధ‌న ఖ‌ర్చుల‌ను అంచ‌నా వేసి మీ *రుసుముల‌ను అధిగ‌మించి ఆదా చేయ‌గ‌లం అనుకున్న‌ప్పుడు మాత్ర‌మే కార్డును తీసుకోవాలి

ఫ్యూయ‌ల్ బేస్డ్‌ క్రెడిట్ కార్డులు

బీపీసీఎల్ - ఎస్‌బీఐ..

కార్డు తీసుకొన్నాక తొలిసారి లభించే ప్రయోజనాలు

రూ.500 విలువ చేసే 2,000 పాయింట్లు.

బీపీసీఎల్ పెట్రోల్ పంపుల్లో 13X పాయింట్లు ల‌భిస్తాయి.

4 రివార్డు పాయింట్లు రూ. 1 విలువ చేస్తాయి.

బీపీసీఎల్‌ పెట్రోల్‌ పంపుల్లో ప్రతినెలా రూ.100 వరకు సర్‌ఛార్జి రద్దు

ఏటా 70 లీటర్ల వరకు ఆదా చేసుకునే అవకాశం. (కార్డు ప్లాన్‌ ప్రకారం వాడితే)

డైనింగ్‌, నిత్యావసరాలు, సినిమా టికెట్లు, డిపార్ట్‌మెంట్‌ స్టోర్లలో చేసే ప్రతి రూ.100 ఖర్చుపై 5 రివార్డు పాయింట్లు లభిస్తాయి

ఇంధనేతర వస్తువులపై చేసే ప్రతి రూ.100 ఖర్చులపై 1 రివార్డు పాయింట్‌

బిల్లు రూ.2,500 మించితే వాయిదాలుగా మార్చుకునే అవకాశం

కార్డు పొందేందుకు జాయినింగ్ ఫీజు రూ.499

వార్షిక రుసుము రూ.500

నెల‌వారీ ఫైనాన్స్‌ ఛార్జీలు 3.50 శాతం

ఇండియ‌న్ ఆయిల్ - సిటీ

కార్డు తీసుకొన్నాక తొలిసారి లభించే ప్రయోజనాలు

కార్డు తీసుకున్న 30 రోజుల్లోపు చేసే మొద‌టి వ్య‌యంపై రూ.250 ట‌ర్బో పాయింట్లు ల‌భిస్తాయి

ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ పుంపుల్లో చేసే ప్రతి రూ.150 వ్యయంపై 4 టర్బో పాయింట్లు (1 టర్బో పాయింట్ = రూ.1) లభిస్తాయి

నిత్యావసరాలు, సూపర్‌మార్కెట్లలో చేసే ప్రతి రూ.150 ఖర్చుపై 2 టర్బో పాయింట్లు వస్తాయి

డైనింగ్‌, షాపింగ్ కోసం చేసే ప్ర‌తి రూ. 150 ఖ‌ర్చుపై 1 ట‌ర్బో పాయింట్‌ ల‌భిస్తుంది

ఫీచ‌ర్డ్ పార్ట్నర్ స్టోరులో చేసే ప్ర‌తి రూ.150 వ్య‌యంపై 4x ట‌ర్బో పాయింట్లు ల‌భిస్తాయి.

ఇంధన లావాదేవీలపై 1 శాతం సర్‌ఛార్జి రద్దు

జాయినింగ్ ఫీజు రూ.1000 (వార్షిక వ్యయం రూ.30,000 దాటితే రద్దు)

వార్షిక రుసుము రూ.1000 (వార్షిక వ్యయం రూ.30,000 దాటితే రద్దు)

నెల‌వారీ ఫైనాన్స్‌ ఛార్జీలు 3.75 శాతం

ఏటా 70 లీట‌ర్ల వ‌ర‌కు పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు

హెచ్‌డీఎఫ్‌సీ - భార‌త్ క్యాష్‌బ్యాక్‌.

పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాలు, ఐఆర్‌సీటీసీ లావాదేవీలు, మొబైల్‌ రీఛార్జీలు సహా ఇతర బిల్లు చెల్లింపులపై నెల‌కు 5 శాతం క్యాష్‌బ్యాక్‌. చేసే లావాదేవీని బ‌ట్టి ల‌భించే క్యాష్ బ్యాక్‌పై గరిష్ఠ ప‌రిమితి ఉంటుంది

పెట్రోల్‌ పంపుల్లో కనీసం రూ.400 వ‌రకు చేసే లావాదేవీల‌పై 1 శాతం సర్‌ఛార్జి రద్దు వర్తిస్తుంది. గరిష్ఠంగా రూ.250 వరకు ఈ ప్రయోజనం పొందొచ్చు

జాయినింగ్ ఫీజు రూ.500

వార్షిక రుసుము రూ.500

నెల‌వారీ ఫైనాన్స్‌ ఛార్జీలు 3.49 శాతం

ఇండియ‌న్ ఆయిల్ - యాక్సిస్ బ్యాంక్‌.

కార్డు తీసుకొన్నాక తొలిసారి లభించే ప్రయోజనాలు

కార్డు తీసుకున్న 30 రోజుల్లోపు చేసే మొద‌టి వ్య‌యం పై 100 శాతం గ‌రిష్ఠంగా రూ. 250 క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది

ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ పంపుల్లో చేసే ప్రతి రూ.100 లావాదేవీకి 20 రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి. అంటే ఇంధ‌న వ్య‌యంపై 4 శాతం వ‌ర‌కు వెన‌క్కి పొందొచ్చు. ప్రతినెలా కనీసం రూ.100 ఖర్చు చేయాల్సి ఉంటుంది

రూ.200 - రూ.5000 మధ్య చేసే ఇంధన లావాదేవీలపై 1 శాతం సర్‌ఛార్జి రద్దు

ఆన్‌లైన్ షాపింగ్ కోసం చేసే రూ.100 ఖ‌ర్చుపై ప్ర‌తీసారి 5 రివార్డు పాయింట్లు పొందొచ్చు

యాక్సిస్ బ్యాంక్‌ భాగస్వామ్య రెస్టారెంట్లలో చేసే డైనింగ్‌ బిల్లులపై 20 శాతం రాయితీ వర్తిస్తుంది

కార్డు జాయినింగ్ ఫీజు రూ.500

వార్షిక రుసుము రూ.500 (క్రితం ఏడాది ఖర్చులు రూ.50,000* *మించితే వార్షిక రుసుము రద్దు)

నెల‌వారీ ఫైనాన్స్‌ ఛార్జీలు 3.40 శాతం

ఏటా 70 లీట‌ర్ల వ‌ర‌కు పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు

గుర్తుంచుకోండి: క్రెడిట్ కార్డులో వ‌డ్డీ ర‌హిత కాలం ఉంటుంది. స‌కాలంలో బిల్లు చెల్లించక‌పోతే 28-49 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇవి కార్డు ప్ర‌యోజ‌నాన్ని హ‌రించి వేయ‌డంతో పాటు అద‌న‌పు భారం ప‌డేలా చేస్తాయి. అందువ‌ల్ల కార్డు ఉన్న‌ప్ప‌టికీ ఖ‌ర్చులు అదుపులోనే ఉండేలా చూసుకోవాలి. ఒక‌ ప్రణాళిక ప్రకారం వాడుకొంటే అన్నిరకాల ప్రయోజనాలూ పొందొచ్చు