Monday, 30 September 2019

ఏవి వద్దు? వేటికి హద్దు? కొలువు సాధనకు సులువైన సూత్రాలు

ఏవి వద్దు? వేటికి హద్దు? కొలువు సాధనకు సులువైన సూత్రాలు

*®కావాల్సిన డిగ్రీలు.. మెరిట్‌ మార్కులు ఉన్నాయి.* చాలినంత పరిజ్ఞానమూ ఉంది. అయినా కోరుకున్న కలల కొలువు కచ్చితంగా దక్కుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే.. దరఖాస్తుకు ముందు దశ నుంచి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వరకు ఆఫర్‌ లెటర్‌ను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో  ఉన్నాయి. అవేమిటో తెలుసుకొని అడుగులు జాగ్రత్తగా వేస్తే ఆశించిన ఉద్యోగాన్ని అందుకోవచ్చు.


ఉద్యోగం.. అనగానే అవేవో పుస్తకాలు ముందేసుకుని చదవడం, గతంలో ఇంటర్వ్యూలకు వెళ్లినవారి సలహాలు తీసుకోవడం.. తదితరాల గురించే అభ్యర్థులు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏం చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అంతగా దృష్టిపెట్టరు. వేటలో ఆదమరపుగా ఉంటే లక్ష్యం ఎలా చేజారిపోతుందో.. అలాగే ఉద్యోగ ప్రయత్నంలో అజాగ్రత్తల వల్ల అవకాశాలూ అందకుండాపోతాయి.  ఏం చేయాలో తెలుసుకోవడంతోపాటు ఏం చేయకూడదో గ్రహించాలి. కొత్తగా ఉద్యోగాల కోసం వెతుకుతున్నవారు, మరో జాబ్‌లోకి మారాలనుకునే అందరికీ ఇవి అవసరమే. ఎన్నోసార్లు ఉద్యోగాల కోసం ప్రయత్నించిన అనుభవం ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడే జాబ్‌ వెతకడం మొదలుపెట్టిన వారిలో ఈ శాతం ఇంకొద్దిగా ఎక్కువ ఉండవచ్చు. చిన్న చిన్న తప్పులూ కలల ఉద్యోగాన్ని దూరం చేస్తాయి. అందుకే ఎంపిక ప్రక్రియలో ఎక్కడ పొరపాట్లు జరగడానికి అవకాశం ఉందో గ్రహించి, జాగ్రత్త పడాలి. రెజ్యూమె తయారీ నుంచి ఇంటర్వ్యూ వరకూ అప్రమత్తంగా ఉండాలి.
ఏవి వద్దు? వేటికి హద్దు? కొలువు సాధనకు సులువైన సూత్రాలుఏవి వద్దు? వేటికి హద్దు? కొలువు సాధనకు సులువైన సూత్రాలు/2019/09/easy-principles-to-get-achieve-the-job.html

దరఖాస్తుకు ముందు..!


ఏం చేయవచ్చు?:  ఉద్యోగ ప్రయత్నంలో ఇంటర్‌నెట్‌ను ఉపయోగించడం మంచిదే. కానీ అసలు, నకిలీ సైట్లను తెలుసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఎన్నో జాబ్‌ పోర్టళ్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో అభ్యర్థికి అనుకూలమైనదేదో గ్రహించి నమోదు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ సైట్లలో రిజిస్టర్‌ చేసుకోవడం ఉపయోగకరం. చాలా సంస్థలు రిఫరెన్స్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే నెట్‌వర్కింగ్‌ పెంచుకోవాలి. సీనియర్లు, నచ్చిన సంస్థల్లో తెలిసిన వారితో స్నేహసంబంధాలను కొనసాగించాలి. డిగ్రీ పూర్తయిన తర్వాత నెట్‌వర్కింగ్‌ సంగతి చూసుకోవచ్చని నిర్లక్ష్యం చేయకూడదు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే అందరితో సత్సంబంధాలను సాగించాలి. ఇందుకు లింక్‌డిన్‌, ట్విటర్‌ వంటివి సాయపడతాయి.
చదువుకుంటున్నప్పుడే ఏయే రంగాల్లో ఉద్యోగాలు వస్తాయనేది చాలా వరకు తెలుస్తుంది. ఆ ప్రకారం ప్రయత్నాలు ప్రారంభించాలి. ఖాళీల వివరాలు తెలుసుకోడానికి సంస్థల వెబ్‌సైట్లను అనుసరించవచ్చు. కానీ ప్రతి ఈ-మెయిల్‌కూ రెజ్యూమె పంపకూడదు. సైట్లలోని సమాచారం నుంచి అభ్యర్థుల్లో ఎలాంటి లక్షణాలను సంస్థలు ఆశిస్తున్నాయో గ్రహించాలి. ప్రకటన వెలువడగానే ఏ పోస్టు, ఎలాంటి నైపుణ్యాలను అడుగుతున్నారో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థుల గురించి తెలుసుకోవడానికి సోషల్‌ మీడియాపై సంస్థలు ఆధారపడుతున్నాయి. ఆ వివరాలను రెజ్యూమెలో జోడించడానికి ముందే అభ్యంతరకరమైన ఫొటోలు, వ్యాఖ్యలను తొలగించాలి.

ఏవి వద్దు? వేటికి హద్దు?
* నెట్‌లో కనిపించే ప్రతి ఉద్యోగ ప్రకటనను నమ్మవద్దు.
* వెబ్‌సైట్లు, కంపెనీల సైట్లలో కనిపించే ఈ-మెయిళ్లకు గుడ్డిగా రెజ్యూమెలను పంపొద్దు.
* ప్రముఖ సంస్థ పేరుతో ప్రకటన కనిపించగానే చెక్‌ చేసుకోకుండా దరఖాస్తుకు సిద్ధం కావద్దు.
* సోషల్‌ మీడియా ఖాతాల లింక్‌లను సరిగా పరిశీలించకుండా రెజ్యూమెలో చేర్చవద్దు.

అప్లై చేసుకునేటప్పుడు..!ఎలా ఉండాలి?:  నిజానికి రిక్రూటర్‌ రెజ్యూమెకు కేటాయించే సమయం కొన్ని నిమిషాలే. కానీ దాని ప్రభావం ఎక్కువే ఉంటుంది. అభ్యర్థిపై మొదటి అభిప్రాయం కలిగించేది ఇదే. కాబట్టి, రెజ్యూమెను ఆకర్షణీయంగా సిద్ధం చేయాలి. రిక్రూటర్‌ పరిశీలించే కొద్ది సమయంలోనే దోషాలు, తప్పులతో రెజ్యూమె ఉంటే ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారనే భావన కలుగుతుంది. ఎలాంటి పరీక్షలూ ఉండవనే ఉద్దేశంతో కొంతమంది తోచిన నైపుణ్యాలను పొందుపరిచేస్తారు. వాటిపై అడిగిన ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలతో అభ్యర్థుల నైపుణ్యాల స్థాయిని రిక్రూటర్లు అంచనా వేసేస్తారు. అందుకే లేని స్కిల్స్‌ను ప్రస్తావించకపోవడం మంచిది. సోషల్‌ మీడియా ఆధారంగా అభ్యర్థుల ప్రవర్తనను తెలుసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
రెజ్యూమెను ఎక్కువ సమాచారంతో నింపితే ఘనంగా ఉంటుందని కొందరు భావిస్తుంటారు. విషయాన్ని క్లుప్తంగా చెప్పడమూ ఒక నైపుణ్యమే అని గ్రహించాలి. అనవసర వివరాలతో నింపితే అవసరమైన విషయాలు మరుగున పడిపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి ఒకే సమయంలో కొన్ని పోస్టుల కోసం రకరకాల సంస్థలకు దరఖాస్తు చేయాల్సి వస్తుంది.  అంతా తమకు సంబంధించిన సమాచారమే కదా అని అభ్యర్థులు ఒకే రెజ్యూమెను అన్నింటికీ ఉపయోగించడం మంచిది కాదు. ఆ సంస్థలన్నీ ఒకే రంగానికి చెందినవైనప్పటికీ హోదాను బట్టి ఆశించే వివరాలు,  నైపుణ్యాలు మారుతుంటాయి. ప్రతి దరఖాస్తులోనూ తగిన మార్పులు చేసి పంపాలి.
అప్లై చేసి చేతులు దులిపేసుకోకూడదు. ఫాలోఅప్‌ చేయాలి. అందువల్ల ఉద్యోగం పట్ల అభ్యర్థికి ఉన్న ఆసక్తి సంస్థకు తెలుస్తుంది. అలా అని దరఖాస్తు చేసిన రెండో రోజు నుంచే ఫాలోఅప్‌ మెయిల్స్‌ అవసరం లేదు. కనీసం అయిదు నుంచి వారం రోజుల సమయం తీసుకోవాలి. లింక్‌డిన్‌లో మెసేజ్‌ చేయవచ్చు. క్లుప్తంగా ఉండాలి. ఒకవేళ ఎంపిక కాలేదని చెబితే కారణాలను అడిగి తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో దరఖాస్తు చేసుకునేటప్పుడు మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోడానికి ఆ కారణాలు ఉపయోగపడతాయి.

* తప్పులు, దోషాలున్న రెజ్యూమెను పంపొద్దు. అసత్యాలను చేర్చొద్దు.
* సుదీర్ఘమైన రెజ్యూమెలు వద్దు.
* ఏ ఉద్యోగానికైనా ఒకే రెజ్యూమెని పంపే ధోరణిని వదిలిపెట్టాలి.

* ఒక హోదాకి పరిమితం కాకుండా వివిధ ఉద్యోగాలకు సరిపోయేలా నైపుణ్యాలతో రెజ్యూమెని నింపవద్దు.
* ఫాలో అప్‌ చేయకుండా ఉండటం మంచిది కాదు.

Also Read |

Successful Interview Tips, Advice & Guidelines (With Examples)

ఇంటర్వ్యూ సమయంలో..!


ఎలా వెళ్లాలి?: కొన్నిసార్లు ఫోన్‌ నెట్‌వర్క్‌/ తెలియని ప్రదేశం కారణంగా ఇంటర్వ్యూ వేదిక, సమయం అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు మళ్లీ ఫోన్‌ చేసి వివరాలు అడగటమో లేదా మెసేజ్‌ చేయమని కోరడమో చేయవచ్చు. ఇంటర్వ్యూ సమయానికి కాస్త ముందుగానే వెళ్లాలి. వస్త్రధారణ అభ్యర్థిపై తొలి అభిప్రాయాన్ని కలిగిస్తుంది. నలిగిపోయినవీ, మురికిగా ఉన్నవీ, ఫ్యాషన్‌ దుస్తులూ నిర్లక్ష్యాన్ని సూచిస్తాయి. శరీరానికి తగిన రంగులతో శుభ్రంగా ఉన్న ఫార్మల్‌ దుస్తులు ధరించాలి. శరీర భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఐ కాంటాక్ట్‌ ఇవ్వాలి. ఇంటర్వ్యూ ప్యానెల్‌లో అందరినీ పలకరించాలి. ప్రాథమిక సన్నద్ధతతో ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. సంస్థ గురించి కనీస విషయాలను తెలుసుకోవాలి. అభ్యర్థికి సంబంధించి ప్రశ్నలను అడిగినప్పుడు రెజ్యూమెలో ఉన్న అంశాలకే పరిమితం కాకూడదు. అదనంగా తమలోని బలాలు; సంస్థకూ, ఫలానా హోదాకూ ఏవిధంగా తాము సరిపోతారో చెప్పవచ్చు. సాధించిన విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలను వివరించవచ్చు. అభ్యర్థిలోని భయాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో సబ్జెక్టు కాకుండా ఇతర విషయాల ప్రస్తావనను బోర్డు తీసుకొస్తుంది. ఆ సమయంలో చర్చకు వచ్చిన అంశానికి సంబంధించి ఏదైనా వ్యతిరేక అభిప్రాయం ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తపరచకూడదు. తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సి వస్తే ఆ టాపిక్‌పై ప్రత్యేకమైన అభిప్రాయం ఏదీ లేదని చెప్పి తప్పించుకోవచ్చు. ఇంటర్వ్యూ చివర్లో ఏమైనా సందేహాలుంటే అడగమంటే  భవిష్యత్తుకు ఉపయోగపడే వాటిని ప్రస్తావించాలి. జీతానికి సంబంధించి వీలైనంత వరకు అడగకపోవడం మంచిది. అడిగినా.. అది వాస్తవానికి దూరంగా ఉండకుండా చూసుకోవాలి. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఫీడ్‌బ్యాక్‌ అడగవచ్చు.

* ఇంటర్వ్యూ సమయం, వేదిక వంటి విషయాలను చెక్‌ చేసుకోవడం విస్మరించవద్దు.
* వస్త్రధారణ, శరీర భాషల పట్ల నిర్లక్ష్యం పనికిరాదు.
* సంస్థకు సంబంధించిన ప్రాథమిక అంశాలను తెలుసుకోవడం మరచిపోకూడదు.
* నెగెటివ్‌ కామెంట్ల జోలికి వెళ్లొద్దు.
* తెలియని ప్రశ్నలకు ఏదో ఒక సమాధానం చెప్పవద్దు.
* ఇంటర్వ్యూ సమయంలోనే జీతం గురించి ప్రశ్నలు వేయకూడదు.

ఇంటర్వ్యూ తర్వాత..!


ఎలా స్పందించాలి?: ఇంటర్వ్యూ తర్వాత ఉద్యోగం రావడం, రాకపోవడంతో సంబంధం లేకుండా మరుసటి రోజు కృతజ్ఞతలు చెబుతూ మెయిల్‌ ఇవ్వాలి. దాన్ని ఇంటర్వ్యూ చేసిన వారి పేరు మీద పంపాలి. ఇంటర్వ్యూ ఫలితం ఏదైనప్పటికీ మర్యాద పూర్వకంగా స్పందించడం బాగుంటుంది. ఉదయం తిన్న టిఫిన్‌ నుంచి చూసిన సినిమా వరకు ప్రతిదాన్నీ సోషల్‌ మీడియా గోడకి ఎక్కించడం చాలామందికి అలవాటు. ఇంటర్వ్యూ విషయంలో అలాంటి పొరపాటు చేయవద్దు. ఆఫర్‌ లెటర్‌ అందితే ఎంపికయ్యామని లేదంటే విఫలమయ్యామని ప్రకటించడం వరకే పరిమితం కావాలి. ఉద్యోగం వస్తే.. ‘బురిడీ కొట్టించా’ననో, రాకపోతే తిడుతూనో మెసేజ్‌లు పెట్టడం మంచిది కాదు. అది భవిష్యత్తు ఇంటర్వ్యూలపై ప్రభావం చూపుతుంది.
ఉద్యోగం వచ్చేవరకూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ ప్రదేశంలో అయినా పని చేయడానికి సిద్ధం అంటారు. ఎంపికైన తర్వాత సమయం, ప్రదేశాలకు సంబంధించి ధోరణి మార్చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నిజంగానే అ అంశాలపట్ల ఇబ్బందులు ఉంటే ముందుగానే వాటిని రిక్రూటర్‌ దృష్టికి తీసుకురావాలి. మార్పులు చేసే అవకాశాన్ని పరిశీలించమని కోరాలి. డిమాండ్‌ చేయకూడదు. జీతానికి సంబంధించీ ఇదే విధానాన్ని అవలంబించాలి. సంస్థ ప్రకటించిన దానికంటే ఎక్కువ వేతనం ఆశిస్తున్నప్పుడు తగిన కారణాలను వివరించాలి. మార్కెట్‌ రిసెర్చ్‌ ఆధారంగానే అడుగుతున్నట్లు తెలియజేయాలి.


* ఇంటర్వ్యూ తర్వాత థాంక్యూ చెప్పడం మరచిపోవద్దు.
* ఫలితాన్ని సోషల్‌ మీడియాలో పెట్టేయ్యాలనే ఆత్రుత మంచిది కాదు.
* ఎంపికైనట్లు కాల్‌ వస్తే ఆశిస్తున్న అంశాల జాబితాను పరిచేయవద్దు.

AP Latest Information

Lastest Jobs Details

Academic Information

 • Snehitha TV for Academic Videos
 • We are the team of passionate bloggers. Every day we research latest information on the current education, jobs information.

  Title 11

  CETS-2016
  AP
  TS
  GOs
  AP
  TS
  GLIs
  AP
  TS
  DEO Websites
  AP
  TS
  Health Cards
  AP
  TS
  PRC GOs
  AP
  TS
  Top