Friday, April 20, 2018

పాఠశాలల బలోపేతానికి 12 సూత్రాలు

పాఠశాలల బలోపేతానికి 12 సూత్రాలు




వేసవి సెలవుల్లో అమలుకు సన్నాహాలు

ఈ నెల 13వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారిని అలాగే కొనసాగించడం ఒక ఎత్తైతే, కొత్త విద్యార్థులను చేర్పించడం మరో ఎత్తుగా ఉపాధ్యాయులు భావిస్తుంటారు.

 ఇప్పటి వరకు సాధించిన ప్రగతి కొత్త విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు దోహదపడుతుంది. ఆకర్షణీయమైన ఏక రూప దుస్తులు, ఇంటి ముందుకు బస్సు సౌకర్యం, రంగురంగుల కరపత్రాలతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు గ్రామాల్లో తిరుగుతున్నారు. *దీనికి ప్రతిగా నూతన విద్యా సంవత్సరంలో అనుసరించాల్సిన వ్యూహాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వివరించింది.* ఉపాధ్యాయులు కనీసం పన్నెండు రకాల సమాచారాన్ని సేకరించాలని ఆదేశించింది.

 ఈ 12 సూత్రాల అమలుతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని భావిస్తోంది.
వేసవి సెలవుల్లో ఆచార్య జయశంకర్‌ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని, 12 సూత్రాలను అమలు చేయాలని  ప్రభుత్వం పాఠశాలలకు సూచించింది. అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్ర సమాచారాన్ని అందజేసింది.
/2018/04/Telangana-prof-jayashanker-badi-bata-schedule-day-wise-activities.html
పాఠశాలల బలోపేతానికి 12 సూత్రాలు


                అనుసరించాల్సిన వ్యూహాలు ఇలా ఉన్నాయి


విద్యార్థికి సంబంధించిన ‘స్వాట్‌’:
 పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ప్రొఫైల్‌ను సిద్ధం చేసుకోవాలి. వారి బలాలు, బలహీనతలు, ఆవకాశాలు, ఆందోళనలను వివరంగా రాసి పెట్టుకోవాలి. ప్రతి విద్యార్థి ఆందోళనను అధిగమించి చదువులో ఎలా రాణించాడో వివరంగా పేర్కొనాల్సి ఉంటుంది. వీరి విజయ గాథలను సమాజానికి వివరించాల్సి ఉంటుంది. ప్రతి విద్యార్థి కుటుంబ నేపథ్యం, ఆయన లక్ష్యాలు, సాధించాల్సిన లక్ష్యాలను వివరించాలి.

నూరు శాతం నమోదు:
 ప్రతి పాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగన్‌వాడీ ఉపాధ్యాయులతో తరచూ  మాట్లాడాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా కృషి చేయాలి. ఐదేళ్లలోపు చిన్నారుల వివరాలను సేకరించి వారి తల్లిదండ్రులతో తరచూ మాట్లాడాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఐదు, ఏడో తరగతి విద్యార్థుల వివరాలు సేకరించాలి. వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలలను తమ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించాలి.

బడి బయట పిల్లల వివరాలు:
 పాఠశాలవిద్యలో ఈ వివరాలు ఎంతో కీలకమైనవి. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బడి బయట పిల్లల వివరాలను సేకరించాలి. బాలురైతే ఆవాస పాఠశాలలకు, బాలికలైతే  కస్తూర్బా పాఠశాలల్లో చేర్పించాలి.

సున్నా నమోదు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి:
గతేడాది పలు కారణాలతో ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరని పరిస్థితి నెలకొంది. ఈ సారి ఇది పునరావృతం కాకుండా.. విద్యార్థులు చేరకపోవడానికి కారణాలు అన్వేషించాలి. నాణ్యమైన బోధన అందిస్తామన్న భరోసా తల్లిదండ్రులకు కల్పించాలి.


వీడ్కోలు.. స్వాగతం..
తమ పాఠశాలలో చదువు పూర్తయిన వారిని పై తరగతికి పంపడానికి ఏర్పాట్లు,  కొత్త వారిని చేర్పించడానికి స్వాగత ఏర్పాట్లు చేసుకోవాలి. ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలలో చేర్పించేందుకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల వివరాలు సేకరించి అందుబాటులో ఉంచుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలి. ఐదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ ఒకటో తరగతిలో చేరే విద్యార్థులకు స్వాగతం పలకాలి. బడి బయట విద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థుల వివరాలను సేకరించాలి.

సమాచార డెస్క్‌:
ప్రతి పాఠశాలలో కొత్త విద్యార్థుల నమోదుకు సమాచార డెస్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి. కొత్త విద్యార్థి చేరగానే ప్రవేశ ప్రక్రియను వెంటనే పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి.

ఇళ్లిల్లూ తిరగాలి:
బడిలో కూర్చొని విద్యార్థులు రావడం లేదనుకునే బదులు, ప్రభుత్వ పాఠశాలకు అనుసంధానించిన ఆవాసంలోని ప్రతి ఇల్లూ తిరిగి బడి ఈడు పిల్లలను పలకరించాలి. వారిని తమ పాఠశాలలో చేర్పించేలా  ఉపాధ్యాయులు ఏర్పాటు చేసుకోవాలి.

*♦స్కూల్‌ ప్రొఫైల్స్‌:*
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ ఆవాసంలోని బడి ఈడు పిల్లల వివరాలను సేకరించి పెట్టుకోవాలి. బడికి వస్తున్న విద్యార్థులతో పాటు బడి బయట ఉన్న బడి ఈడు పిల్లల వివరాలను సమగ్రంగా సేకరించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య, విద్యార్థులు సాధించిన ప్రగతి తదితర సమాచారాన్ని పాఠశాల ప్రొఫైల్‌లో నిక్షిప్తం చేసుకోవాలి

*♦పాఠశాల అభివృద్ధి ప్రణాళిక:*
ప్రతి పాఠశాల కొత్త విద్యాసంవత్సరంలో ఎంత మంది  విద్యార్థులను చేర్చుకోనుంది, సామర్థ్యాల సాధనలో ఎంత ప్రగతి సాధించనుంది, వివిధ గ్రేడుల సాధన, సాధ్యాసాధ్యాల గురించి సవివర ప్రణాళిక రూపొందించి దగ్గర ఉంచుకోవాలి. ఇందులో నిధుల లభ్యత, వనరుల వినియోగం తదితర అంశాలను పొందుపరచాలి.

ప్రచార సామగ్రి:
 ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమ పాఠశాల సాధించిన ప్రగతిని వివరించే కరపత్రాలు, ఫ్లెక్సీలు,  బ్యానర్లు, గోడ పత్రికలను సిద్ధంగా ఉంచుకోవాలి. తమ విద్యార్థుల ప్రతిభా పాటవాలు, వారు సాధించిన ప్రగతి వివరాలను సేకరించాలి. విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేలా ప్రచార సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి.


త్రీ ఆర్స్‌పై దృష్టి :
ముగుస్తున్న  విద్యా సంవత్సరంలో  కనీస అభ్యసన సామర్థ్యాల సాధనలో కీలకమైన త్రీ ఆర్స్‌ విషయంలో విద్యార్థులు సాధించిన ప్రగతిపై సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలి. ఆశించిన ప్రగతి సాధించని విద్యార్థులకు ప్రభుత్వం అనుమతిస్తే వేసవి సెలవుల్లో నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో సిద్ధం చేయాల్సి ఉంటుంది.


ఆవాస విద్య రిజిస్టర్‌:
ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విలేజ్‌ ఎడ్యుకేషన్‌ రిజిస్టర్‌లో ఎప్పటికప్పుడు తాజా వివరాలను నమోదు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందు కోసం ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ బాధ్యులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి.