Monday, March 23, 2020

ప్రియమైన 10వ తరగతి విద్యార్ధినీ విద్యార్థులకు, ప్రేమ తో వ్రాయునది....SSC Students -How to use their valable time during these lock down days

ప్రియమైన 10వ తరగతి  విద్యార్ధినీ విద్యార్థులకు,  ప్రేమ తో వ్రాయునది....

1) 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 31/3/2020 నుండి యధాతధంగా జరుగుతాయి.

2)మీ అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వృధాగా తిరుగుతూ సమయం పాడు చేసుకొనవద్దు.

3)బయట కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. మన జిల్లాలో కూడా ఉందంటున్నారు.


4)ఈ సందర్భంగా ఇచ్చిన శెలవులు చదువు కోవడానికి బాగా ఉపయోగించుకొనండి.

5) కష్టంగా ఉండే టాపిక్స్ ముందుగా చదువుకోండి.

6) ప్రతీరోజూ గణితం సాధన చేయాలి. ఒక చిత్తు పుస్తకం లో చూడకుండా సాధన చేయాలి.

7) ఒక టైం టేబుల్ వేసుకుని అన్నీ సబ్జెక్టు లూ సాధన చేయాలి.

8) కాస్తా మంద  బుద్ధి గల పిల్లలు ముందుగా బిట్స్, ఒక మాటతో ఉన్న జవాబులు, రెండు మార్కుల జవాబులు తరువాత సైన్స్ బొమ్మలు, మ్యాప్ పాయింటింగ్, గ్రాపులు బాగుగా సాధన చెయ్యాలి

9) ఆంగ్లం లో మంచి పట్టు కోసం Vocabulary, One word substitutions, Synonyms, Antonyms, Binomials idiomatic expressions, అన్నీ టెక్స్ట్ బుక్ exercises మరియు  Conversations, Diary entry, Letter writing, Biographical sketches బాగా చదవాలి.


ప్రియమైన 10వ తరగతి విద్యార్ధినీ విద్యార్థులకు, ప్రేమ తో వ్రాయునది..../2020/03/ssc-10th-class-students-how-to-use-their-valuable-time-during-this-lock-down-days.html
Add caption


10) తెలుగు వ్యాకరణం, ప్రతిపదార్థాలు ఉపవాచకంలోని పాత్రలూ లేఖలూ బాగుగా సాధన చెయ్యాలి.

11) హిందీ వ్యాకరణం, కవి పరిచయ్, దోహేలు వాటి సారాంశం, లింగ, వచనాలు మార్పు , వ్యతిరేక పదాలు మరియు ముఖ్యమైన భారతీయ పండుగలు, పర్యావరణ కాలుష్యము మరియు మిత్రులకు లేఖలూ బాగుగా సాధన చెయ్యాలి.

12) ఇంకా మీ సబ్జెక్టు ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు పాటించండి.

13) ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోండి, సమయానికి నీళ్ళు ఎక్కువగా త్రాగoడి.

14) ఈరోజు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం గా రేపు మీరూ మీ తల్లిదండ్రులు సంతోషం గా ఉంటారు. మిమ్ములను కని పెంచిన తల్లి దండ్రులు మిమ్మల్ని చూసి చాలా గర్వంగా తలెత్తుకునేలా వారితో పాటు మేము కూడా సంతోషంగా ఉండేలా చదివి ముందుగా మీకు మీ కుటుంబానికి మరియు దేశానికి ఉపయోగపడే ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ......

పదవ తరగతి పరీక్షలలో 10 G.P.A. సాధించడానికి ఉపయోగపడే అంశాలు.


1. పదవ తరగతి పరీక్ష చాలా తేలికైన పరీక్ష. ఒక నెల రోజులు బాగా చదివినా 10 G.P.A. ఆశించవచ్చు.
2. పదవతరగతి పరీక్ష చాలా ముఖ్యం అన్న వాళ్ళ మాట పట్టించుకోకండి. తర్వాత ఇంటర్మీడియట్లో , డిగ్రీలో అలాగే చెప్తారు.
3. ఆరోగ్యం, విశ్రాంతి విషయంలో సాధారణ జాగ్రత్తలు అవసరం. ఆటలు, హాబీలు, ఫోన్ వాడకం కొంచెం తగ్గిస్తే మంచిది.
4. ఒక WhatsApp గ్రూప్ ఏర్పరచుకుని సబ్జెక్టు విషయాలు చర్చించుకోవచ్చు. నోట్సు, సైన్సు చిత్రాలు, గ్రాఫులు, నిర్మాణాలు మ్యాప్లు  తేలికగా మార్పిడి చేసుకోవచ్చు. ఒక ఉపాధ్యాయుడిని Group Admin గా తీసికోండి.
5. మీకు సౌకర్యంగా ఉండే సమయంలో చదవండి. ఎంతసేపు చదివారన్నది ముఖ్యం. ఎప్పుడు చదివారన్నది ముఖ్యం కాదు.
6. సమాధానాలు చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను పెన్సిల్ తో Underline/ highlight చెయ్యండి.
7. ఒక విషయం రెండుసార్లు చదివినా అర్థం కాకపొతే వెంటనే ఉపాధ్యాయుని/ సహవిద్యార్ధిని అడగండి.
8. నేర్చుకున్న విషయం, పునర్విమర్శ కూడా చేసిన విషయం Tracking System ద్వారా గుర్తించండి. చివర నమూనా ఇయ్యబడినది.
9. విషయాన్ని బట్టి Mind Map, Concept Map, Flow chart వంటివి తయారు చేసుకోండి. చివర నమూనాలు  ఇయ్యబడినవి.
10. జ్ఞాపక శక్తికి చిట్కాలు ఉండవు. బాగా నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుంటాయి. గుర్తుండట్లేదు అంటే మరొక్కసారి నేర్చుకోండి. ఉపాధ్యాయుల సహాయం తీసికోండి.
11. చదివే విషయం అర్థం కావడానికి, ఆసక్తికి సంబంధం ఉంటుంది. వేరే ఆసక్తికి మార్గాలు ఉండవు.
12. మీకు ఈపాటికి ప్రశ్నాపత్రం నమూనా, ఏ సెక్షన్లో ప్రశ్నలకి ఎన్ని మార్కులుంటాయి అనేది తెలిసే ఉండాలి.
13. విద్యాప్రమాణాల ఆధారంగా ఏ సెక్షన్లో ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలిసి ఉండాలి. లేదా బ్లూప్రింట్ గురించి ఉపాధ్యాయులను అడగండి.
14. ప్రశ్నాపత్రం చదవడానికి కనీసం పది నిముషాలు కేటాయించండి.
15. సమాధానాలు వ్రాయాలనుకున్న ప్రశ్నలను ప్రశ్నాపత్రంలో టిక్ చెయ్యండి. వ్రాసిన తర్వాత ప్రశ్నాపత్రంలో సర్కిల్ చెయ్యండి.
16. వీలైనంత వరకు ప్రశ్నాపత్రం క్రమంలోనే సమాధానాలు ఉండేట్టు చూసుకోండి. ఎగ్జామినర్ కు వీలుగా ఉంటుంది.
17. సమాధాన పత్రంలో ప్రశ్న సంఖ్య తప్పనిసరిగా వ్రాయండి. స్కెచ్ పెన్ వాడచ్చు కానీ ఎరుపు/ ఆకుపచ్చ వాడకూడదు.
18. నాలుగు వైపులా మార్జిన్స్ ఒక స్కెచ్ పెన్ వాడి గీయవచ్చు. ఎక్కువ రంగులు వాడకండి.
19. గణితంలో రఫ్ వర్క్ చూపించండి. సమాధానాన్ని బాక్స్ లో సూచించండి.
20. నిర్మాణం ప్రశ్నలో Rough Diagram కు మార్కులు వుంటాయి.
21. సైన్సులో బొమ్మ గీసిన తర్వాత భాగాలు అక్కడే గుర్తించాలి. సంఖ్య ఇచ్చి భాగం పేరు వేరొక చోట వ్రాయకండి.
22. సోషల్ స్టడీస్ లో కూడా మ్యాప్ ఉన్నచోటే ప్రదేశాన్ని గుర్తించాలి.
23. ఏ సబ్జెక్టులోనయినా సమాధానాల్ని పాయింట్స్ రూపంలో వ్రాయండి. వ్యాసాలు వంటివి running matter లా వ్రాయాలి.
24. ఒక ప్రశ్నకు పూర్తి సమాధానం వ్రాయలేకపొతే కొంచెం స్థలం వదలి తరువాత ప్రశ్నకు వెళ్ళండి. ఎక్కువ సమయం ఒకే ప్రశ్న వద్ద ఆగిపోకండి.
25. ఒక పేజిలో దాదాపు ఇరవై వరకు లైన్లు వస్తాయి. మరీ పెద్దగా లేదా చిన్నగా వ్రాయకండి.
26. నాలుగు మోడల్ ప్రశ్నాపత్రాల నుండి సమాధానాలు చదవండి. నాలుగు ప్రశ్నాపత్రాలు స్వయంగా ప్రయత్నించండి.

పదోతరగతి పరీక్ష విద్యార్థి జీవితంలో మొదటి మైలురాయి. తర్వాతి దశలో ఏ పరీక్షలకు హాజరైనా.. ఎలాంటి ఉద్యోగానికి ప్రయత్నించినా.. పదిలో సాధించిన మార్కులెన్నో పరిశీలిస్తారు. అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. అందుకే ఈ పరీక్షలు అందరికీ ఎంతో ముఖ్యం. మంచి మార్కులు సాధించడమే లక్ష్యం. కాస్త ప్రణాళికతో వెళితే అదంత కష్టం కాదంటున్నారు నిపుణులు. విషయాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. పరీక్షా విధానంపై పరిపూర్ణమైన అవగాహన పెంచుకోవాలి. వెయిటేజీని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.

ఇప్పటికే అందరికీ సిలబస్‌ దాదాపు పూర్తయి ఉంటుంది. ఇక వార్షిక పరీక్షలకు సిద్ధంకావడంపైనే దృష్టి పెట్టాలి. ఎలా చదవాలి? ఎంత చదవాలి? రివిజన్‌ ఎప్పుడు మొదలుపెట్టాలి? ఇలాంటి సందేహాలతో సతమతమై ఆందోళన పెంచుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. పరీక్షలకు సుమారు వందరోజులకు మించి సమయం ఉంది.చక్కగా ఉపయోగించుకుంటే మంచి ప్రిపరేషన్‌కు ఈ వ్యవధి చాలు. సబ్జెక్టును చదవడం ఎంత ముఖ్యమో, రివిజన్‌ చేయడం అంతే అవసరమని గుర్తించాలి. వీలైతే చదివింది ఒకసారి రాసి చూసుకోవడం ఇంకా మంచిది. పరీక్షలకు చాలా వ్యవధి ఉందనే విషయాన్ని గమనించి పరీక్షల భయాన్ని వదిలేయాలి. ఆందోళన మొదలైతే చదివింది మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రయత్నపూర్వకంగానైనా ప్రశాంతతను అలవాటు చేసుకోవాలి. ప్లాన్‌ లేకుండా ఏ పని చేసినా గందరగోళంగా ఉంటుంది. అందుకే అన్ని విధాలా అనుకూలమైన స్వీయ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఉపాధ్యాయుల సాయాన్ని తీసుకోవచ్చు. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులనూ అర్థం చేసుకుంటూ చదవాలి. తర్వాత చూడకుండా రాయాలి. సమాధానాలను సరిచూసుకోవాలి. సరిగా రాకపోతే మళ్లీ అధ్యయనం చేయాలి. ప్రశ్నపత్రంపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి.

జనరల్‌ సైన్స్‌
పేపర్‌-1: జనరల్‌ సైన్స్‌లో భౌతిక, రసాయన శాస్త్రాలు పేపర్‌-1గా ఉంటాయి. మారిన ప్రశ్నపత్రంలో నాలుగు సెక్షన్లలో నిర్దేశించిన విద్యా ప్రమాణాలకు అనుగుణంగా 33 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ విద్యార్థి లోతైన అవగాహనను పరీక్షించే విధంగా ఉంటాయి. అరమార్కు, ఒకటి, రెండు మార్కుల ప్రశ్నల్లో ముఖ్యంగా కారణాలు తెలపడం, పటం ఆధారిత ప్రశ్నలు, సమస్యా సాధన, నిత్య జీవితంలో అనువర్తనాలపై ప్రశ్నలు ఇస్తారు. నాలుగు మార్కుల ప్రశ్నల్లో ముఖ్యంగా భేదాలు రాయడం, ప్రయోగాలు వివరించడం, పట్టిక ఆధారిత ప్రశ్నలు, విశ్లేషణాత్మక ప్రశ్నలు, పేరగ్రాఫ్‌ ఇచ్చి ప్రశ్నలడగడం, కిరణ పత్రాలపై ప్రశ్నలుంటాయి. కృత్యాలు, ప్రయోగ అంశాల్లో కావాల్సిన పరికరాలు, పరిశీలనలు, జాగ్రత్తలు నేర్చుకోవాలి.
పేపర్‌-2: జీవశాస్త్రం పరీక్షలో అర మార్కు ప్రశ్నల్లో ముఖ్యంగా ఉదాహరణలు రాసే ప్రశ్నలు, బొమ్మఆధారిత, పదాన్ని మార్చి రాసేవి, శాస్త్రవేత్తలు-పరిశోధనలు, ఫ్లోచార్టు ఇచ్చి తప్పిపోయిన పదాన్ని రాసేవి, నేనెవర్నీ అని అడిగే ప్రశ్నలు, అది అయితే ఇది ఏమి.. అని ప్రశ్నించేవి వస్తాయి. ఒకటి, రెండు మార్కుల ప్రశ్నల్లో కారణాలను తెలపడం, పరికల్పనలు చేయడం, వైద్య నిపుణులు, పర్యావరణ వేత్తలు వంటి వారిని ప్రశ్నించడం, బొమ్మ ఆధారిత, దత్తాంశ విశ్లేషణకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నాలుగు మార్కుల్లో ముఖ్యంగా భేదాలు, ప్రక్రియలను వివిధ సోపానాలలో వివరించడం, నినాదాలు, పాటించాల్సిన నియమాలు, బొమ్మఆధారిత, ప్రయోగ ఆధారిత, దత్తాంశ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. బొమ్మలకు సంబంధించిన ప్రశ్నల్లో బొమ్మ ఇచ్చి ప్రశ్నలడగడం లేదా బొమ్మ గీసి వివరణ అడగడం వంటి ప్రశ్నలు ఇస్తారు. వాటిని అధ్యయనం చేయాలి. -

తెలుగు
పేపర్‌-1: అవగాహన- ప్రతిస్పందన ప్రశ్నలు 16 మార్కులకు ఉంటాయి. ఇందులో ప్రతిపదార్థం, పద్యపూరణం, భావం రాయాలి. శివరాజంతట, తనచూపంబుధి, ఆ-యేమీ యెుకరాణివాసమును, మా సర్దారుడు, దెసలను కొమ్మలొయ్య.. పద్యాలను బాగా చదవాలి. పరిచిత గద్యానికి పూర్తి వాక్యాలతో సమాధానాలు రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. యవనపు పుణ్యాంగనామణి, వఱదైన చేను దున్నకు, ఓ మునీశ్వర.. వంటి చిన్న పద్యాలను సాధన చేయాలి. వ్యక్తీకరణ- సృజనాత్మకత ప్రశ్నలను 22 మార్కులకు ఇస్తారు. ఒక కవిపరిచయం, ఒక నేపథ్యం, ఒక ప్రక్రియ తప్పనిసరిగా ఉంటాయి. వీటికి నాలుగైదు వాక్యాల్లో స్పష్టంగా జవాబు రాయడం నేర్చుకోవాలి. భాషాంశాలకు 12 మార్కులు. అలంకారం, ఛందస్సు ఆరు మార్కులకు ఉంటాయి. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం మొదలైన పద్యాలకు గణవిభజన చేసి, ఏ పద్యమో గుర్తించి, లక్షణాలను రాయడాన్ని అభ్యాసం చేయాలి. లక్ష్యాత్మక ప్రశ్నల్లో అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి-వికృతి, సంధులు, సమాసాలు ఉంటాయి. మొత్తం 12 మార్కులకు వస్తాయి.
పేపర్‌-2: ఈ పేపర్‌లో రామాయణం కీలకం. 4 మార్కులకు ఒక సంఘటన క్రమం, పది మార్కులకు అయిదు లఘుప్రశ్నలు, 4 మార్కులకు ఒక వ్యాసరూప ప్రశ్న మొత్తం 18 మార్కులకు ఉపవాచకం నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవేకాకుండా ఒకటి రెండు జాతీయాలను అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు అన్ని కాండలు చదవాలి. అవగాహన- ప్రతిస్పందనకు సంబంధించి రామాయణంలోని ఏదో ఒక కాండ నుంచి సంఘటన క్రమాన్ని మొదటి ప్రశ్నగా అడుగుతారు. రెండో ప్రశ్నలో అపరిచిత పద్యానికి అంటే.. సుమతీ, వేమన, కుమార, తెలుగుబాల మొదలైన శతకాల నుంచి ఇచ్చిన పద్యాన్ని జాగ్రత్తగా చదివి భావంతో పాటు నీతి, విశేషాలు రాయాలి. తర్వాత రెండు అపరిచిత గద్యాలు ఉంటాయి. కరపత్రం, లేఖ, సంభాషణ, ప్రకటన మొదలైనవి. జాగ్రత్తగా ప్రాక్టీస్‌ చేస్తే 8కి 8 మార్కులు పొందవచ్చు. వ్యక్తీకరణ- సృజనాత్మకత ప్రశ్నలు 22 మార్కులకు ఇస్తారు. పాత్రస్వభావం, నీవేమి గ్రహించావు, విషయాత్మక ప్రశ్నలు ఉంటాయి. వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధం, రామాయణ ప్రాశస్త్యం, శ్రీరామలక్ష్మణుల యాగసంరక్షణ చేసిన విధానం, శ్రీరామసుగ్రీవుల మైత్రి, సీతాపహరణం మొదలైనవి ప్రధానంగా చదవాలి. -

గణితం
గణితం పేపర్‌-1లో ఏడు, పేపర్‌-2లో ఏడు అధ్యాయాలతో మొత్తం వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పేపర్‌-1లో వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, శ్రేఢులు ప్రధానంగా చదవాలి.పేపర్‌-2లో నిరూపక రేఖాగణితం, త్రికోణమితి, సాంఖ్యకశాస్త్రం, సంభావ్యతలపై దృష్టిసారించాలి. ఇప్పటి నుంచి ప్రతివారం రెండు విభాగాల చొప్పున పూర్తిస్థాయిలో రోజుకు 2గంటల చొప్పున సాధన చేయాలి. పునశ్చరణ కోసం ప్రతి అధ్యాయానికి చెందిన సూత్రాలు, పట్టికలు, నిర్వచనాలు, పటాలు, ఒకచోట రాసుకోవాలి. మైండ్‌ మ్యాప్స్‌ వేసుకోవాలి. సమస్యల సాధనలో సూక్ష్మీకరణలు సరిగ్గా చేయడం, జవాబులు పూర్తి చేయడం చాలా అవసరం. కారణాలు చెప్పడం, నిరూపణలు చేసేటప్పుడు తగిన కారణాన్ని సమాధానాల వద్ద బాక్సుల్లో రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. రేఖాగణితంలో ముఖ్యంగా నాలుగు సిద్ధాంతాలు, వాటి అనువర్తన ప్రశ్నలను సాధన చేయాలి. ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, సరూప త్రిభుజాల వైశాల్యాల సిద్ధాంతం, స్పర్శరేఖల సిద్ధాంతంతోపాటు సరూప త్రిభుజాల నిర్మాణం, స్పర్శరేఖల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. ప్రతి అధ్యాయంలో పటాలను సాధన చేసి గీయడం నేర్చుకోవాలి. చాప్టర్ల చివర ఇచ్చిన కీలక భావనలపై పట్టు సాధించాలి.

ఇంగ్లిష్‌
ఆంగ్లంలో అధిక మార్కులు సాధించాలంటే తేలికగా నేర్చుకోగలిగిన అంశాలను ముందుగా సాధన చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌కు ప్రశ్నపత్రంలో 30 శాతం మార్కులు కేటాయించారు. ఈ విభాగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఉన్నతశ్రేణి ఆలోచనలు, విశ్లేషణాత్మక అవగాహనను పరీక్షించే ప్రశ్నలను ఎక్కువ సాధన చేయాలి. గ్రామర్‌ విభాగంలో ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌కు 9 మార్కులు ఉన్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి ఉంచాలి. ఎడిటింగ్‌ ప్యాసేజస్‌ను ఎక్కువ సంఖ్యలో సాధన చేయాలి. టెన్సెస్‌కు మార్కుల వెయిటేజీ పెరిగింది. ఆర్టికల్స్‌ కొత్తగా ప్రశ్నపత్రంలో చేరాయి. లాంగ్వేజ్‌ ఫంక్షన్‌లో వచ్చిన మార్పులను విద్యార్థులు గమనించాలి. వొకాబ్యులరీ విభాగంలో డిక్షన్రీ ఎంట్రీని చేర్చారు.దీని కోసం లెర్నర్స్‌ డిక్షన్రీని పరిశీలించాలి. రైటింగ్‌ విభాగంలో ఇచ్చిన ప్యాసేజ్‌లో నిర్దేశించిన భాగాలపై ప్రశ్నలను తయారు చేయమని అడుగుతారు. దీని కోసం పాఠ్యపుస్తకంలో సి.రీడింగ్‌ పాఠ్యాంశాలను సాధన చేయాలి.

సాంఘికశాస్త్రం
సాధారణంగా మొదటి పేపర్‌లోని 12 పాఠాల్లో మార్కులు సాధించడం కొంత తేలిక. రెండో పేపర్‌తో పోల్చినప్పుడు మొదటి పేపర్‌ స్కోరింగ్‌కి అనుకూలం. అందుకే మొదటి పేపర్‌లోని ప్రధాన భావనలపై కచ్చితమైన అవగాహన పెంచుకోవాలి. 3, 9 పాఠ్యాంశాల్లోని గ్రాఫ్‌లు చాలా ముఖ్యమైనవి. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం పాయింట్ల రూపంలో రాసుకోవాలి. ఒకటి, అయిదు చాప్టర్లలోని పటాలను బాగా సాధన చేయాలి.పేపర్‌-2లో ఎక్కువ మార్కులు సాధించాలంటే సొంతంగా జవాబులు రాయాల్సిన ప్రశ్నలను చూసి ఆందోళన చెందకుండా సాధన చేయాలి. 13, 14, 15, 21, 22 పాఠాల నుంచి చదివి గుర్తుంచుకోవాల్సిన అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువ. 13, 14 పాఠాల్లోని కాల పట్టికలు సమాచార నైపుణ్యాల రీత్యా అత్యంత ముఖ్యమైనవి. వీటి గురించి ఆయా పట్టికల్లో లేని ముఖ్యమైన సమాచారాన్ని నేర్చుకోవాలి. అన్ని పాఠాల్లో వచ్చిన దేశాల పేర్లు జాబితా రాసుకుని ఖండాల వారీగా సాధన చేయాలి. -

హిందీ
భాష, వ్యాకరణం, సృజనాత్మక అంశాల్లో విద్యార్థి ప్రతిభను పరీక్షించే విధంగా హిందీ సబ్జెక్టులో ప్రశ్నలు వస్తాయి. కొత్త విధానంలో రెండు నూతన అంశాలను పొందుపరిచారు. ఒకటి ప్రకటన (అడ్వర్టైస్‌మెంట్‌), రెండోది హింట్‌ స్టోరీ. ప్రకటన చదివి ప్రశలకు జవాబులు రాయాలి. హింట్‌ స్టోరీకి సంబంధించి ఏదో ఒక తెలుగు కథని హిందీలో ఇస్తారు. దాన్ని చదివి విభక్తులతో పూర్తి చేయాలి. అన్ని పాఠ్యాంశాలకు ప్రశ్నాపత్రంలో సమానమైన వెయిటేజీ ఉంది. భాషాకీ బాత్‌ (వ్యాకరణం), అర్థగ్రాహ్యతా ప్రతిక్రియ (అవగాహన, ప్రతిస్పందన), అభివ్యక్తి (పాఠాల్లోని ప్రశ్నలకు, తగిన జవాబులు రాయడం), సృజనాత్మక విభాగాలుగా ప్రశ్నతం ఉంటుంది. ప్రధానంగా సారాంశాలు, పత్ర్, నిబంధ్, వ్యాకరణాంశాలపై దృష్టిపెట్టాలి. భాషాకీ బాత్‌ జాత్రగత్తగా అవగాహన చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. హిందీ రాయడం ఎవరికైతే బాగా వస్తుందో వారు ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు తగిన విధంగా అభ్యాసం చేయాలి....