Saturday, November 24, 2018

చదువుకోవాలని ఉందా..? ఒక్క ఫోన్ చేయండి అంతా మేమే చూసుకుంటాం..

చదువుకోవాలని ఉందా..? ఒక్క ఫోన్ చేయండి అంతా మేమే చూసుకుంటాం..



ఒకప్పుడు అవి ఆమె అనుభవాలు… వాటినసలు మర్చిపోలేదు. అందుకే తనలా బాధపడేవారికి అండగా 

నిలవాలనుకుంది. చదువుకోవాలని ఉండి… ఆ ఫలాలను అందుకోలేని వారి గురించి తెలిస్తే చాలు 

చదివించాలని తపన పడుతుంది. పెద్ద సంఖ్యలో విద్యార్థుల్ని లక్షలు ఖర్చుపెట్టి చదివించడమే కాకుండా… 

పుస్తకాలూ, యూనిఫాంలూ, బస్‌పాస్‌లూ అందజేస్తోంది కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన సుశ్మితా మధుకర్‌. 

విదేశాల్లో స్థిరపడినా సేవా కార్యక్రమాలను ఎలా ఆచరణలో పెడుతోందో ఆమె మాటల్లోనే..
చదువుకోవాలని ఉందా..? ఒక్క ఫోన్ చేయండి అంతా మేమే చూసుకుంటాం../2018/11/sushmitha-madhukar-inspirational-story-school-children-education-and-welfare.html

చదువుకోవాలని ఉందా..? ఒక్క ఫోన్ చేయండి అంతా మేమే చూసుకుంటాం..


ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. చదువుకోవాలని ఉన్నా, ఆర్థికంగా అండ లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో నాకూ అనుభవమే. కారణం నేను కూడా పేద కుటుంబం నుంచి రావడమే. అందుకే అలాంటి వారిని చేరదీసి చదివించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నా. దాన్నే ఇప్పుడు ఆచరణలో పెడుతున్నా. అమెరికాలో ఉన్నా పేద విద్యార్థుల గురించి తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తా. అందుకే ఇప్పటివరకూ ఎనభై మంది విద్యార్థుల చదువుల బాధ్యతల్ని తీసుకోగలిగా. ఇంకా మున్ముందు మరింత మందిని చదివించాలని లక్ష్యం పెట్టుకున్నా. నేను విద్యాదానం చేయగలుగుతున్నానంటే మా అమ్మానాన్నల సహకారం ఎంతో ఉంది. మాది కృష్ణాజిల్లా చల్లపల్లి. చిన్న తనంలో బంధువుల వద్ద పెరిగా. అలా వారి సహకారంతో పదో తరగతి పూర్తయ్యాక అమెరికా వెళ్లా. అక్కడ కొంత కాలమే వాళ్లు నన్ను చేరదీశారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల పట్టించుకోలేదు. అప్పటికే డాక్టర్‌ కావాలనే లక్ష్యం మనసులో పడింది. అయితే వెనక్కి రావాలో.. అక్కడే ఉండాలో అర్థం కాని పరిస్థితి. నాకు స్వతహాగా పట్టుదల ఎక్కువ. కష్టపడి చదివి ఎప్పుడూ ముందు ఉండేదాన్ని. అలాంటప్పుడు పరిస్థితులకు భయపడి ఇంటికి వెనక్కి తిరిగి రావాలనిపించలేదు. ఓ నాలుగు నెలలపాటు స్నేహితురాలి దగ్గర ఉండి.. వాళ్ల అమ్మ సాయంతో చదువుకున్నా. ఆ తరవాత పార్ట్‌టైం ఉద్యోగం చూసుకుని నా కాళ్ల మీద నేను నిలబడుతూ చదువుకోవడం మొదలుపెట్టా. అలా వైద్య విద్యని పూర్తి చేశా. దాంతోపాటు ఆసుపత్రిని నిర్వహించే కోర్సూ చేశా. ఎందుకంటే ఎప్పటికైనా ఓ ఆసుపత్రి కట్టించి నడిపించాలన్నది నా లక్ష్యం. అలా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుని వైద్యురాలిగా పట్టా అందుకున్నా. అమెరికాలోని డెన్వర్‌ కొలొరాడోలోని ఓ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తూనే ఆ ఆసుపత్రి నిర్వహణా బాధ్యతలు చూసుకుంటున్నా. నిపుణులు పనిచేస్తోన్న ఓ కీలక పరిశోధనలోనూ భాగస్వామిగా ఉన్నా.

వ్యక్తిగతంగా, వృత్తిగతంగా స్థిరపడిన తరువాత నా పెళ్లైంది. మావారు మధుకర్‌ది విజయవాడ పరిధిలోని నిడమనూరు. ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నేను అన్ని విధాలుగా స్ధిరపడ్డాను… ఇక ఏ ఇబ్బందీ లేదనుకున్నాక పేద పిల్లల్ని చదివించాలనుకుంటున్నట్టు మావారికి చెప్పా. ‘మంచి ఆలోచన.. అలానే చెయ్‌! అవసరమైతే నేను నా వంతు సాయం చేస్తా’ అన్నారు. అలా 2010 నుంచి భారత్‌లోని పేద పిల్లల్ని చదివించడం మొదలుపెట్టా. అలాగని అప్పుడే ఎన్జీఓ మొదలుపెట్టలేదు. కొన్నాళ్లకి ‘బండి చిల్డ్రన్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ వెల్ఫేర్‌ ట్రస్టు’ పేరుతో సంస్థను ప్రారంభించా. ప్రస్తుతం దాని ద్వారానే పిల్లల్ని చదివించడం, వారికి కావల్సిన సౌకర్యాలు అందించడం, వైద్య సేవలు కల్పించడం… వంటివి చేస్తున్నా. ఇక, మా సంస్థ ద్వారా పిల్లల్ని చదివించాలంటే మొదట వారికి ఉండాల్సిన అర్హత చదువుకోవాలనే దృఢ సంకల్పం. అవును, చాలామందికి చదువుకోవాలని ఉన్నా.. ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరమవుతున్నారు. అలాంటి వారిని గుర్తించి నేను చదివిస్తున్నా. అలా ఇప్పటి వరకూ ఎనభై మందిని చదివించగలిగితే ప్రస్తుతం ఇరవై రెండు మంది పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు. వారిలో ఐదో తరగతి నుంచి ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో ఉన్నవారూ ఉన్నారు. ఖర్చు ఉండదు అని నేనేం ప్రభుత్వ పాఠశాలకు పంపను. బాగా చదువు చెప్పే స్కూలూ, కాలేజీలకే పంపుతా. ఆర్థిక ఇబ్బంది పడుతున్న పిల్లల గురించి తెలిస్తే నేను వారి గురించి ఆరా తీస్తా. నిజంగా చదువుకోవాలనే తపన ఉన్నట్టు గుర్తించడమే కాదు.. ఆర్థిక పరిస్థితి కూడా లేదని తెలిశాకే చదివిస్తా. ముందుగా పేద విద్యార్థులు మా ట్రస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. దాని ద్వారా ప్రవేశ పరీక్ష రాయాలి. అలా అన్నింట్లో అర్హత సాధించినవారినే చదివిస్తా. అదీ ఎంత వరకూ చదువుకుంటానంటే అంత వరకూ…!
మేం ఎంపిక చేసిన విద్యార్థులకు ఫీజుతోపాటు పుస్తకాలూ, యూనిఫాంలూ, పెన్నులూ, బస్‌పాస్‌లు కూడా అందిస్తా. వారు ఎలా చదువుతున్నారో ఎప్పటికప్పుడు మార్కులూ, ప్రోగ్రెస్‌ రిపోర్టులు తెప్పించుకుని చూస్తా. కాలేజీకీ వెళుతున్న పిల్లల రికార్డులో గార్డియన్‌గా మా నాన్న ఫోన్‌ నంబరు ఉంటుంది. వారు కాలేజీకి వెళుతున్నారో లేదో ఆయనకి ఎప్పటికప్పుడు మెసేజ్‌ వెళుతుంది. దాన్ని బట్టి ఆయన వాళ్ల గురించి తెలుసుకుంటూ ఉంటారు. నాకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తారు. నేను విద్యార్థుల్ని దత్తత తీసుకున్నాక ఒక ఏడాది వారి చదువును గమనిస్తాను. బాగా చదివితే సరే… అలా కాకుండా మొదటి, రెండో ఏడాదీ మార్కులు సరిగ్గా తెచ్చుకోకపోతే ఓసారి మాట్లాడతా. సరిగ్గా చదవకపోవడానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా. నా వంతుగా సహకరిస్తా. అయినా చదువులో ప్రతిభ కనిపించలేదంటే ఆ తరువాతి ఏడాది ఫీజులు కట్టకపోవచ్చని చెబుతా. అప్పుడయినా వారిలో మార్పు వస్తుందని నా అభిప్రాయం. మరీ వెనకబడినవారిని మాత్రం పక్కన పెట్టేసి ఆ డబ్బు మరో విద్యార్థికి కేటాయించేలా చూస్తా. అయితే ఇప్పటివరకూ అలాంటి పరిస్థితి రాలేదనుకోండి. నాకు పిల్లల అవసరాలను చూడ్డానికి ఏడాదికి దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. కొంత నేను వేసుకోగా.. మరికొంత నా స్నేహితులు సాయం చేస్తారు. వారిని పిల్లల్ని దత్తత తీసుకోమని అడుగుతా. ఫీజులు లేదా ఇతర అవసరాలు.. ఇలా ఏదో ఒకటి చూడమని అడుగుతా. కొందరు ఫీజు కడితే, మరికొందరు పుస్తకాలు కొనిస్తారు.


నేను అమెరికాలో ఉన్నా.. మా అమ్మనాన్నలూ, జార్జ్‌ సర్‌ అని ఒక తెలిసిన అతను నాకు ఎప్పటికప్పుడు పిల్లల వివరాలను, చదువులో ప్రోగ్రెస్‌ను తెలియజేస్తూ ఉంటారు. అందుకే తరచూ రాకపోయినా పిల్లల గురించి నాకు బెంగ ఉండదు. నేను చదువు చెప్పిస్తున్న పిల్లలకు వైద్యసాయం కావాలన్నా చూస్తా. ఇద్దరు ముగ్గురు పిల్లలకు శస్త్రచికిత్సలు కూడా చేయించా. ఈ విషయంలో మావారి సహకారం ఎంతో ఉంది. నేను వృత్తి రీత్యా, అన్ని పనులతో తీరిక లేకపోయినా మా పిల్లలిద్దరినీ మా వారే చూసుకుంటారు. నాకు ఎక్కువ రోజులు సెలవులు దొరికితే ఇక్కడకు వచ్చి పిల్లల్ని కలుస్తా. త్వరలోనే రావాలనుకుంటున్నా. మరింతమంది విద్యార్థుల్ని చదివించాలని ఆశ పడుతున్నా. ప్రస్తుతం అయితే మా ఊరూ, చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పిల్లల్నే చదివిస్తున్నా. ఇతర ప్రాంతాల్లో అలాంటి పిల్లలు ఉండి..
ఆర్థిక పరిస్థితులు సహకరించక బాగా చదువుకోవాలనుకునే విద్యార్థులు 9440662229 నంబర్‌లో సంప్రదించొచ్చు.